Wednesday, October 25, 2006

నా సుందర సంకల్ప కాండ

చదువు పెద్దగ చదువుకోకయు
తాత తండ్రులు తనకి చెప్పిన
క్రిష్ణ చేష్ఠలు రామ చరితను
చిన్న కధలుగ పడక సమయమున
ఉగ్గు పాలతొ నాకు పోసి
దైవ సన్నిధి కిపుడు చేరిన
అమ్మమ్మకు పాదాభి వందనము!!

జన్మ నిచ్చిన మాత లలితకు
బ్రతుక తెలిపిన తండ్రి శర్మకు
చదువునిచ్చిన మొదటి గురువుకు
జంధ్యమేసిన మేనమామ అయ్యకు

తోడునిచ్చిన బావ సూరికి
కూతురిచ్చిన అత్త కాళికి
స్నేహమిచ్చిన మామ రామమోహనుకు
పేరు పేరున వినమ్ర వందనములు

కష్ట ఘడియల చేయి నిచ్చుచు
తప్పు చేసిన చక్క దిద్దుచు
తల్లిదండ్రికి దూరమైనను
చీకటింటను కంటి వెలుగై
నా తోడునిలిచిన భార్య శైలకు
ప్రేమనిండిన హృదయ సుమములు


తేట తెల్లగ కవితలల్లగ
మాట తీరుగ కధలు చెప్పగ
ప్రాస, భాష నాకు రావు
గురువు లఘువులు నాకు తెలియదు
కవిని కానని తనకి తెలిసీ
కావ్య మొకటి వ్రాయమన్నది


వేద మాతకు శిరస్సు వంచితి
ఆమె ఆజ్ఞను స్వీకరించితి
చదువు తల్లికి మదిన మెదిలిన
ఆకాంక్ష నాకొక భాగ్యమేగ

రామ కార్యము సిద్ధి చేయగ
సీతనెదికిన స్వామి మారుతి
మాత ఆనతి అమలు చేయగ
నా తోడునిలుచుట తధ్యము

సుందర కాండను చెప్ప నెంచితి
ఆదికవి అశీస్సులందించు గాక
కళగల కావ్యము వ్రాయ నెంచితి
మంగళమూర్తి కరుణించు గాక

చదువు తల్లి నా తలను నిమరగ
పవన సుతుడు తన కధను నడపగ
బొజ్జ గణపతి నా చేయి కదపగ
మొదటి కావ్యము వ్రాయబూనితి

అమ్మ ఆనతో కావ్య పధమునడువ
తడబడు అడుగుల బుడతను
వడివడిగా ఒంటరిగా నడువజాల
చేయూత నిచ్చి నడుపగలరని ఆశ చాల!!

ఓం శ్రీం గ్లౌం గం మహా గణాథిపతయే నమః!!